BJP | న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడం పట్ల బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ వ్యవహారశైలిని తప్పుబట్టారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ మృతికి దేశమంతా సంతాపం పాటిస్తున్న సమయంలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకే రాహుల్ గాంధీ వియత్నాం బయల్దేరి వెళ్లారంటూ మాలవీయ ఆరోపించారు.
ఈ సందర్భంగా బ్లూస్టార్ ఆపరేషన్ను ప్రస్తావిస్తూ సిక్కులను గాంధీలు, కాంగ్రెస్ ద్వేషిస్తారని, దర్బార్ సాహిబ్(అమృత్సర్ స్వర్ణ దేవాలయం)ని ఇందిరా గాంధీ అపవిత్రం చేసిన విషయాన్ని మరచిపోరాదని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాణిక్కం టాగూర్ స్పందిస్తూ అది రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన.. మీకేం బాధ అని ప్రశ్నించారు.