BJP-Congress | ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు.. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించినప్పుడే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సత్య దూరం అన్నారు.
ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించిన రోజే.. అదే ఈవీఎంల ద్వారా ఎన్నికైన ప్రియాంక గాంధీ మాత్రం లోక్ సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారని గౌరవ్ భాటియా గుర్తు చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు.