న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఢిల్లీలో కన్నుమూశారు. 1931 డిసెంబర్ 3న లాహోర్‌లో జన్మించిన ఆయన రాజకీయ జీవితం జన్‌సంఘ్‌తో మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు.
ఢిల్లీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదిగిన ఆయన 1999 లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై విజయం సాధించారు. ‘ఎక్స్’ వేదికగా మల్హోత్రా మృతికి ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ నివాళి అర్పించారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.