Mahayuti Alliance | ముంబై, మార్చి 24: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండేవర్గం, ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గంతో కూడిన ‘మహాయుతి’ కూటమిలో ముసలం మొదలైంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లక్ష్యంగా సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన నేత విజయ్ శివ్తారే తీవ్ర విమర్శలు చేయడంతోపాటు బారామతి లోక్సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించడం అజిత్ పవార్ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. శివ్తారేను పార్టీ నుంచి తొలగించకుంటే.. అధికార మహాయుతి కూటమి నుంచి వైదొలుతామని అల్టిమేటం జారీచేసింది.
ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేశ్ పాటిల్ మాట్లాడుతూ శివ్తారేపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే షిండేను కోరామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి శరద్ పవార్ వర్గం తరపున సుప్రియా సూలే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఆయన భార్య సునేత్ర పవార్ బరిలో దిగుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి తాను కూడా పోటీచేస్తానని మహాయుతి కూటమిలోని శివసేన నేత విజయ్ శివ్తారే ఈ నెల 12న ప్రకటించడం వివాదంగా మారింది.