చెన్నై, డిసెంబర్ 30: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాలను నడపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ సమస్య తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఢిల్లీ ఇలా చాలా రాష్ర్టాల్లో ఉన్నదని తెలిపారు. కేంద్రం ఇలా వ్యవహరించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ మాట్లాడుతూ ‘రాష్ర్టాలకు రాజ్యాంగం హక్కులు కల్పించింది. కానీ ఆ హక్కులను నేడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలరాస్తున్నది. ఇందుకు ఉదాహరణే గవర్నర్ల వ్యవస్థ. గవర్నర్లను అడ్డంపెట్టుకొని రాష్ర్టాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇది కూడా కేవలం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే జరుగుతున్నది.
తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిందే. అలాగే కేరళలో పినరాయి విజయన్, ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని, బెంగాల్లో మమత ప్రభుత్వాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ ఏ విధంగా సతాయిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. అంతెందుకు.. పుదుచ్చేరిలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. కానీ ఆ ప్రభుత్వ పెద్ద అయిన సీఎం ఏకంగా గవర్నర్పైనే విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాల్లో గవర్నర్ల జోక్యం ఏవిధంగా పెరిగిపోతున్నదో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటాయి. ఒకరాష్ట్ర ప్రభుత్వం అసె ంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ తొక్కిపెట్టడం పద్ధతేనా? దీని వెనుక ఉన్నదెవరో ప్రజలందరికీ తెలుసు. బాధ్యతాయుతమైన కేంద్రం గవర్నర్లను అడ్డంపెట్టుకొని సమాంతర ప్రభుత్వాలను నడుపడం సబబేనా? ఇదేనా ప్రజాస్వామ్యమంటే.. ఇదేనా సమా ఖ్య వ్యవస్థ అంటే.. ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకోవాలి’ అని సూచించారు.
దేని లెక్క దానికే..
‘గుజరాత్ అనేది ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం. కాబట్టి అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిసిండొచ్చు. అంతమాత్రాన దేశమంతటా బీజేపీ ప్రభావం ఉందని అనుకోవద్దు. అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్సభ ఎన్నికలు వేరు’ అని స్టాలిన్ ప్రశ్నించారు.