న్యూఢిల్లీ, జూన్ 17: దేశంలోని పలు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్నది. వీటిలో బీజేపీ పాలిత రాష్ర్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం తగ్గుదల, వ్యయం పెరుగుదల, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎస్డీపీ)లో అప్పుల శాతం పెరుగడం వలన 2020లో పలు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి క్షీణించిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక పేర్కొన్నది. 2020-21లో జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి ఆధారంగా.. రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు అధిక అప్పుల భారం కలిగి వున్నాయని జూన్ నెలకు సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన బులెటిన్ పేర్కొన్నది. ఈ రాష్ర్టాల జాబితాలో నాలుగు బీజేపీ పాలనలో ఉన్నవే కావడం గమనార్హం. పైన పేర్కొన్న రాష్ర్టాలన్నింటిలో స్థూల ద్రవ్య లోటు 3 శాతం కంటే ఎక్కువగా ఉన్నది.
తెలంగాణపై వివక్ష
ఆర్బీఐ పేర్కొన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మాత్రం అప్పులు తీసుకోనివ్వదు. ఆర్థిక క్రమశిక్షణ లేని వాటికి మాత్రం ఆంక్షలు పెట్టదు.