Indore | ఇండోర్, జూలై 1: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో తమకు భద్రత కరవైందని కొందరు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరగాళ్లతో వేగలేమని.. ఇండ్లు అమ్ముకొని వలస పోతామని వాపోతున్నారు. ‘నా ఇల్లు అమ్మకానికి ఉంది. వలస వెళ్లాలని నన్ను బలవంతం చేస్తున్నారు’ అన్న సందేశం ఉన్న పోస్టర్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 273 నివాసాలు గల ట్రెజర్ టౌన్షిప్లో 12-14 ఇండ్ల ముందు ఇండ్ల అమ్మకం పోస్టర్లు వెలిశాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోసం ప్రభుత్వం ఈ టౌన్షిప్ నిర్మించింది. ‘ఇక్కడ శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందువల్లే మేము ఇండ్లు అమ్మాలని నిర్ణయించుకున్నాం’ అని ప్రశాంత్ పాండే అనే స్థానికుడు తెలిపాడు.
నేర చరిత్ర ఉన్నవారు తనతో పాటు మరో ముగ్గురిని బెదిరించారని ఆయన వాపోయారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆకతాయిలు గుచ్చి గుచ్చి చూస్తున్నారని, ఈలలు వేస్తూ అసభ్యకరమైన పాటలు పాడుతున్నారని ఓ యువతి వాపోయింది. ‘టౌన్షిప్లో మేము సీసీటీవీ కెమెరాలు అమర్చాం. నిరంతరాయంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. క్రిమినల్ రికార్డులు ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని డీసీపీ ఆదిత్య మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇండ్ల అమ్మకం పోస్టర్ల అంశంపై టౌన్షిప్ నివాసితులతో మాట్లాడిన డీసీపీ.. అదనపు డీసీపీ ర్యాంక్ అధికారితో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.