అహ్మదాబాద్, నవంబర్ 13 : మద్య నిషేధం అమలులో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్లో (Gujarat) ప్రభుత్వం మెల్లిమెల్లిగా దానిని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. గిఫ్ట్ సిటీ తర్వాత గుజరాత్ ప్రభుత్వం కచ్‌లోని దోర్దోలో వార్షిక 100 రోజుల ఉత్సవం రాన్ ఉత్సవ్, సూరత్‌లోని డైమండ్ బోర్స్, నర్మద జిల్లాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రదేశాల్లో మద్య నిషేధాన్ని సడలించనుంది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లోపే అధికారికంగా ప్రకటన చేయనుంది. అంతే కాకుండా ఎంటర్‌ప్రైజస్ లిక్కర్ పర్మిట్లు పొందేందుకు ఒక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది.
రాష్ట్రంలో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసేందుకు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మొబైల్ అప్లికేషన్ టెస్ట్ రన్ జరుగుతున్నదని, అది పూర్తయిన వెంటనే అధికారికంగా మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభిస్తామని డిప్యూ సీఎం హర్ష్ సంఘవి తెలిపారు. దీని ద్వారా జారీ చేసే పర్మిట్ల ద్వారా ఆధీకృత హోటళ్లలో మద్యాన్ని కొనుగోలు చేయవచ్చునన్నారు. గాంధీనగర్ శివారులో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో 2023, డిసెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధంపై కొన్ని మినహాయింపులు ప్రకటించింది.