న్యూఢిల్లీ, మార్చి 31: ఉచిత హామీలకు తాము వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ.. ఐదు రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో భారీగా ఉచిత హామీలు ప్రకటిస్తున్నది. కేరళ, అస్సాం ఎన్నికలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన పార్టీ మ్యానిఫెస్టోలో భారీగా రేవ్డీలను ప్రకటించింది. అధికారమే ధ్యేయంగా ఇతర పార్టీలతో పోటీపడి మరీ ఉచిత పథకాలను ప్రవేశపెడుతున్నది.
పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందిస్తామని కేరళ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. మహిళలకు భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డ్ ద్వారా నెలకు 2,500 విలువైన ఇంటి సరుకులు అందజేస్తామని తెలిపింది. అలాగే మహిళలు, వితంతువులకు, 70 ఏండ్లు పైబడిన వయో వృద్ధులకు నెలకు రూ. 3,000 పెన్షన్ అందజేస్తామని ప్రకటించింది. ఓనమ్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని తెలిపింది.
మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తామని అస్సాం ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. మొత్తం 31 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఐదేండ్లలో రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, లఖ్పతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని వాగ్దానం చేసింది.