న్యూఢిల్లీ, మార్చి 28: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ ఓటర్ల నిర్ణయం కీలకం కానున్నది! రాష్ట్రంలో రెండు వంతుల మెజారిటీపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలోని 54 సీట్లను గెలుచుకోగలిగితే అధికార పీఠం తమకే దక్కుతుందని భావిస్తున్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఈ ప్రాంతానికి ద్రోహం చేసిందన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారాన్ని సైతం ఆ పార్టీ చేపట్టింది. కొత్త ఉత్తర బెంగాల్‌ను నిర్మిస్తామన్న వాగ్దానాన్ని కూడా ప్రజలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నది. మరోవైపు ఈ ప్రాంతంపై తమ పట్టును నిలుపుకొనేందుకు టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీ తన ప్రచారంలో భాగంగా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్‌పై మమత ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపిస్తున్నది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణ బెంగాల్‌తో పోలిస్తే ఉత్తర బెంగాల్‌కు కేవలం 0.002 శాతం మాత్రమే దక్కిందన్నది బీజేపీ వాదన. రూ.5,899 కోట్ల విపత్తు సహాయ నిధుల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల బాధితులకు అన్యాయం జరిగిందన్న అంశాన్ని కూడా ఎన్నికల ప్రచారాస్త్రంగా ఈ ప్రాంతంలో వాడుకోవాలని బీజేపీ యోచిస్తున్నది. స్మగ్లింగ్ ముఠాలకు, రాజకీయ హింసకు ప్రభుత్వం నుంచి అండదండలు ఉన్నాయని ఆరోపిస్తున్న బీజేపీ& ఆ ఆరోపణలనే ప్రచార అస్ర్తాలుగా మలచుకోవాలని ఆలోచిస్తున్నది.
రానున్న ఎన్నికల్లో 54 సీట్లు ఉన్న ఉత్తర బెంగాల్ రాజకీయంగా కీలకం కానున్నది. డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం కూడా ఇందులో భాగంగా ఉంది. 2009 నుంచి ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఇక్కడ తన బలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని బీజేపీ భావిస్తుండగా ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తున్నది. చారిత్రకంగా ఉత్తర బెంగాల్ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌కు కంచుకోటగా ఉండేది. గిరిజనులు, మైనారిటీలు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అనేక ఏండ్లపాటు వెనుకబడినా ఇటీవలే అక్కడ టీఎంసీ బలం క్రమంగా పెరుగుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్లో టీఎంసీ 25 గెలుచుకుంది. అయితే 2021 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 35 సీట్లలో గెలుపొం ది ఆధిక్యతను చాటింది. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్‌లోని 54 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది.