Nawab Malik : మహారాష్ట్రలోని మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ (అజిత్‌పవార్ వర్గం) అభ్యర్థిగా బరిలో దిగుతున్న నవాబ్ మాలిక్ తరఫున ప్రచారం చేసేందుకు బీజేపీ నిరాకరిచడంపై ఆయన స్పందించారు. అదే నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ షిండే వర్గం శివసేన.. సురేశ్ పాటిల్ అనే అభ్యర్థిని బరిలో దించడాన్ని మాలిక్ తప్పుపట్టారు. బీజేపీ, శివసేన తనను వ్యతిరేకించినా తనకు అభ్యంతరం లేదని, తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
‘మాన్‌ఖుర్ద్ శివాజీనగర్ నియోజకవర్గం నుంచి అజిత్‌పవార్ నన్ను బరిలో దించినప్పటికీ ఏక్నాథ్ షిండే వర్గం శివసేన సురేష్ పాటిల్ అనే అభ్యర్థిని పోటీకి పెట్టిందని, బీజేపీ కూడా పాటిల్‌కు మద్దతు తెలుపుతోంది. నా కుమార్తె బరిలో దిగుతున్న నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే శివసేన, బీజేపీ వ్యతిరేకించినా మాకు వచ్చిన నష్టమేం లేదు. రెండు నియోవజకవర్గాల్లో మేం భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించా’ అని నవాబ్ మాలిక్ అన్నారు.
కాగా, మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ నుంచి నవాబ్ మాలిక్‌ను బరిలో దించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయన తరఫున తాము ప్రచారమే చేయమని తెగేసి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, ఏక్నాథ్ షిండే వర్గం శివసేన, అజిత్‌పవార్ వర్గం ఎన్సీపీ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అభ్యర్థిపై ఏక్నాథ్ శివసేన తన అభ్యర్థిని పోటీకి పెట్టడం, అందుకు బీజేపీ కూడా మద్దతు పలుకడం మహాయుతిలో లుకలుకలను బయటపెడుతోంది.