న్యూఢిల్లీ : జార్ఖండ్‌లోని దియోఘఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది. ఎయరి్‌పోర్ట్ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాల ప్రకారం ఆగస్ట్ 31న ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాఠక్, దేవ్తా పాండే, పింటు తివారి అనుమతి లేకుండా దియోఘఢ్ ఎయిర్‌పోర్ట్‌లోని హైసెక్యూరిటీ ప్రాంతమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్రవేశించారు. తమ పలుకుబడిని ఉపయోగించి తమ చార్టర్డ్ విమానానికి క్లియరెన్స్ లభించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
నూతనంగా ఏర్పాటైన విమానాశ్రయంలో ఇంకా రాత్రివేళల్లో విమానాల రాకపోకలకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్‌లో సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకే విమాన సర్వీసులను అనుమతిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం రాత్రి 6.17 గంటలకు టేకాఫ్ అయింది. తమపై ఎఫ్ఐఆర్ నమోదవడం పట్ల ఎంపీ నిషికాంత్ దూబే స్పందిస్తూ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తమ విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతించారని, ఎయిర్పోర్ట్ అధికారులు ఎవరూ అభ్యంతరం తెలపలేదని చెప్పుకొచ్చారు.