న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ, బీజేపీ ఎంపీలు సోమవారం రాజ్యసభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సోనియా గాంధీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కోరారు. గత శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఈ ప్రసంగం అనంతరం రాష్ట్రపతిని ఉద్దేశించి ‘పూర్ లేడీ’ అంటూ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్రపతిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎంపీలు తమ నోటీస్‌లో ఆరోపించారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్నవారి గౌరవాన్ని తక్కువ చేసే విధంగా సోనియా మాట్లాడారని బీజేపీ ఎంపీ ఒకరు ఆరోపించారు.