చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల గురువారం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ పని లేని తాగుబోతులని విమర్శించారు. బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసన తెలిపి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్ చేశారు. దీనిపై రైతులు ఆందోళనకు దిగారు.