న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా కారుపై రైతులు కర్రలతో దాడి చేశారు. హర్యానాలోని హిస్సార్ జిల్లా పర్యటనకు ఎంపీ రామ్ చందర్ శుక్రవారం వెళ్లగా, కొంత మంది రైతులు ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాలను ఉపసంహరించుకోవాలనిజన నాయక్ జనతా పార్టీ తరపున రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రైతులు ఎంపీ కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎంపీ వెళ్తున్న మార్గంలో నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనపై ఎంపీ రామ్ చందర్ మాట్లాడుతూ.. తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. తాను తన కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్తుండగా కొందరు దుండగులు తన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత కర్రలతో దాడి చేసి తను చంపేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఈ దాడిలో తన కారు పూర్తిగా ధ్వంసమైందన్నారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.