న్యూఢిల్లీ, జూలై 26: మోదీ సర్కార్ ఎంతో ఆర్భాటంగా, చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుపై సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటి వరకూ రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ గంగా నది ఎందుకు కలుషితమైందని మంగళవారం ట్విట్టర్లో సూటిగా ప్రశ్నించారు. నది మురుగు నీటితో మగ్గిపోవడానికి జవాబుదారీ ఎవరు? అని నిలదీశారు. ‘ గంగా కేవలం ఒక నది మాత్రమే కాదు.. మన తల్లి. కోట్లాది మంది భారతీయుల జీవనాధారం, ఆచార, సంప్రదాయాలకు, అస్థిత్వానికి ఆధారం ఈ గంగా మాత’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ‘గంగా నది జీవనోపాధి కల్పిస్తుంది. మురుగు నీటి వలన అందులోని చేపలు ఎందుకు మరణిస్తున్నాయి? దీనికి ఎవరు జవాబుదారీ?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.