సిమ్లా: మండీ బీజేపీ ఎంపీ కంగన రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులు జిల్లాలోని షాలిన్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “హిమాచల్‌లో అవినీతి తాండవిస్తున్నదని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు తమ రాష్ర్టాలను ఖాళీ చేస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత సొమ్ము ఎలా ఖర్చు పెడుతుందోనని ఆశ్చర్యం కలుగుతుంది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం రుణాలు తీసుకుని, సోనియా గాంధీకి ఇస్తుంది, అందుకే రాష్ట్రం ఖాళీ అయింది” అని ఆరోపించారు. ప్రకృతి విపత్తులతోపాటు కాంగ్రెస్ పాలన వల్ల రాష్ట్రం దశాబ్దాల వెనుకకు వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలను కోరారు. తాము విపత్తు సహాయక నిధులను ఇస్తే, ఆ నిధులు సీఎం సహాయ నిధికి వెళ్తాయని, అక్కడి నుంచి సోనియా రిలీఫ్ ఫండ్‌కు చేరుతాయని.. ఇది అందరికీ తెలుసునన్నారు.