Kangana Ranaut | న్యూఢిల్లీ: మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో తడబడి మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశానికి తొలి దళిత రాష్ట్రపతి అని ఒక ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్నారు. పైగా, రామ్‌నాథ్ కోవింద్‌కు బదులుగా ‘రామ్ కోవిడ్’ అని పలకడంతో ట్రోలర్లు ఆమెపై మీమ్‌లు, జోక్‌లతో సామాజిక మాధ్యమాలను హోరెత్తించారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులగణన అంశం గురించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దేశానికి మొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అని యాంకర్ సవరించగా, ఆమె వెంటనే తన తప్పును అంగీకరించారు.
మాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై నిరసన జ్వాలలు
మలయాళ చిత్ర పరిశ్రమ మాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు, నటీమణులపై సహచర నటులు, చిత్రపరిశ్రమకు చెందిన వారే లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతాలు బయటపడటంతో పినరయి విజయన్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చలనచిత్ర పరిశ్రమలో వేధింపులపై విచారణకు నియమించిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించినా, పలువురు నటీమణులు తమను వేధించిన నటులు, దర్శకులు, ఇతరుల పేర్లు వెల్లడించినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విపక్ష నేత వీడీ సతీశన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోషులకు విజయన్ ప్రభుత్వం రక్షణగా నిలుస్తున్నదని, ఇంత జరిగినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్ రాజీనామా చేయాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొచ్చి, కొల్లాంలో ప్రదర్శనలు నిర్వహించారు. కొల్లాంలో వారు ముకేశ్ ఇంటి ముందు ఆందోళన జరిపి, నినాదాలు చేశారు.