న్యూఢిల్లీ: ఒకవేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీలో చేరితే అతన్ని పెళ్లాడుతానని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ న్యూస్‌పై కంగనా రౌనత్ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలు అని ఆమె చెప్పారు. తప్పుదోవ పట్టించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇవాళ కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అదో ఫేక్ న్యూస్ అన్నారు. అన్‌వెరిఫైడ్ కాంటెంట్ వ్యాప్తి చెందుతున్న వైఖరిని ఆమె విమర్శించారు.
రాజకీయాల్లో మహిళలను టార్గెట్ చేయడానికి ఇలాంటి చర్యలకు దిగుతుంటారని కంగనా అన్నారు. ఆ ఫేక్ న్యూస్ బాధాకరంగా ఉందని, రాజకీయాల్లోని మహిళలకు మర్యాద ఇవ్వడం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు చర్య అని ఆమె అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో రాహుల్ గాంధీతో పెళ్లి గురించి కంగనా వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ వ్యాప్తి అవుతున్నాయి. కానీ ఆ వ్యాఖ్యలకు తగిన ఆధారాలు మాత్రం లేవు. ఎక్కడ నుంచి ఆ వ్యాఖ్యలు వ్యాప్తి చెందాయో కూడా క్లారిటీ లేదు. కానీ ఆన్లైన్లో మాత్రం చాలా వేగంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రనౌత్ స్పందించారు. ఆన్లైన్ యూజర్లు కొందరు ఆ వ్యాఖ్యలను సెటైర్‌గా చిత్రీకరించారు.
