Kangana Ranaut : అయోధ్య విరాళాల (Ayodhya Donations) లో దుర్వినియోగానికి పాల్పడిన వారిని బీజేపీ (BJP), ఆరెస్సెస్ (RSS) కలిసి కాపాడుతున్నాయని కాంగ్రెస్ (Congress) చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) తిప్పి కొట్టారు. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతికేంచిన పార్టీ.. ఇప్పుడు అదే అంశంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రామమందిరం నిర్మించాలని వింతరాగం అందుకుందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి గురించి దేశప్రజలందరికీ తెలుసన్నారు. శతాబ్దాల తరబడి సాగిన పోరాటం భక్తి ఫలితంగానే రామమందిర నిర్మాణం సాధ్యమైందని కంగన పేర్కొన్నారు. సనాతన సంస్కృతి, విశ్వాసం, దేశ వారసత్వాన్ని పరిరక్షించడానికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. తమ పార్టీ ప్రజల విశ్వాసాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనంగా వాడుకోలేదని, అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాల కోసం మతాలను సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. రామమందిరం వంటి పవిత్రమైన అంశాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు.