National Anthem | కర్నాటకలోని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే జాతీయ గీతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతాన్ని బ్రిటిషన్ అధికారిని స్వాగతించేందుకు రాశారని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందిచారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యను తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యల్లో అర్థం లేదని.. ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర, వాట్సాప్ జ్ఞానమని అభివర్ణించారు. జాతీయ గీతం, వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హొన్నావర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ విశ్వేశ్వర్ హెడ్గే కగేరి పాల్గొని మాట్లాడారు. దేశ జాతీయ గీతం బ్రిటిష్ అధికారిని స్వాగతించేందుకు రాశారన్నారు. వందే మాతరానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర కన్నడ ఎంపీ సూచించారు.
రెండింటీకి సమాన హోదా ఉందన్న ఆయన.. తాను చరిత్రలోకి వెళ్లాలనుకోవడం లేదన్నారు. వందేమాతరాన్ని జాతీయగీతం చేయాలనే బలమైన డిమాండ్ ఉందని.. కానీ మన పూర్వీకులు బ్రిటిష్ అధికారిని స్వాగతించడానికి రూపొందించిన జన గణ మనతో పాటు వందేమాతరంను ఉంచాలని నిర్ణయించారన్నారు. ఇప్పటికే దాన్నే అనుసరిస్తున్నామన్నారు. ఈ 150వ సంవత్సరంలో వందేమాతరం అందరికీ చేరాలని.. అది పాఠశాలలు, కళాశాలలు, యువత, సామాన్య ప్రజల వరకు చేరాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. జాతీయ గీతం బ్రిటిష్ వారిదని ఎంపీ కగేరి చెబుతున్నారని.. ఇది అర్థం లేదన్నారు. ‘మరో రోజు ఆర్ఎస్ఎస్ నుంచి మరో వాట్సాప్ చరిత్ర పాఠం’ అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో విమర్శించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో భారత భాగ్య విధాత అనే శ్లోకాన్ని రాశారని.. దాని మొదటి పద్యం జన గణ మనగా మారిందని ఖర్గే పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని మొదట డిసెంబర్ 27, 1911న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌లో పాడారని పేర్కొన్నారు. తాను చరిత్రలోకి వెళ్లడం లేదన్న ఎంపీ వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ.. ప్రతి బీఆర్ఎస్, ఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తల స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ సంపాదకీయాలను చదివి చరిత్రను పునః పరిశీలించాలని సూచించారు. రాజ్యాంగం, త్రివర్ణ పతాకం, జాతీయ గీతాన్ని అగౌరవ పరిచే గొప్ప సంప్రదాయం ఆర్ఎస్ఎస్కు ఉందంటూ విమర్శలు గుప్పించారు. 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభ సందర్భంగా బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తయిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది.