కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. విష్ణుపూర్ బీజేపీ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ ఆ పార్టీని వీడి సోమవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బెంగాల్ ప్రజల్లో అలజడికి కారణమవుతున్నందునే తాను కాషాయ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. బెంగాల్ అభివృద్ధికి, సంక్షేమానికి అందరూ తృణమూల్ కాంగ్రెస్లో చేరాలని ఘోష్ పిలుపు ఇచ్చారు.
కాగా తన్మయ్ ఘోష్ బెంగాల్ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. అంతకుముందు బంకుర జిల్లా విష్ణుపూర్ టీఎంసీ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఘోష్ టీఎంసీలో చేరడం సంతోషకరమని విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు స్వాగతించారు. పలువురు బీజేపీ నేతలు టీఎంసీలో చేరేందుకు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు.