పనాజీ: గోవాలో మద్యపానాన్ని నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. (Ban On Alcohol In Goa) రాష్ట్రంలో పెరుగుతున్న మద్యపానం కారణంగా రోడ్డు ప్రమాదాలు, పారిశ్రామిక యూనిట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన డిమాండ్‌ను వ్యతిరేకించారు. నార్త్ గోవాలోని మాయెమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేంద్ర షెట్, మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘వికసిత్ భారత్, వికసిత్ గోవా’ కోసం గోవాలో మద్యం వినియోగాన్ని నిషేధించాలని అన్నారు. ‘రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయవచ్చు. కానీ గోవాలో మద్యం వినియోగాన్ని నిషేధించాలి’ అని అన్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేంద్ర షెట్ డిమాండ్‌ను తోటి బీజేపీ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. పర్యాటకులు గోవాకు రావడానికి మద్యం కూడా ఒక కారణమని కొందరు ఎమ్మెల్యేలు తెలిపారు. గోవాలో రెస్టారెంట్ వ్యాపారాలను మూసివేయాలని షెట్ కోరుకుంటున్నారా? అని పలు హోటల్స్ నిర్వహిస్తున్న బీజేపీ మహిళా ఎమ్మెల్యే డెలిలా లోబో ప్రశ్నించారు. గోవాలో మద్యాన్ని నిషేధించడం సాధ్యం కాదని ఆప్ ఎమ్మెల్యే క్రూజ్ సిల్వా అభిప్రాయపడ్డారు.