ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో(Maharashtra civic poll) బీజేపీ దూకుడు ప్రదర్శించింది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే తో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యంలో ఉన్నది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ముందంలో కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మున్సిపాల్టీలకు కౌంటింగ్ మొదలైంది. ముంబైలో ఉన్న 227 వార్డుల్లో ప్రస్తుతం బీజేపీ 62 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. మరో 46 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏకనాథ్ షిండేకు చెందిన శివసేన 16 వార్డుల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది.
గురువారం పోలింగ్ కోసం ఏకమైన థాకరే సోదరులు.. పెద్దగా ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ 10 స్థానాల్లో , రాజ్‌థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 6 సీట్లలో ముందంజలో ఉన్నాయి. షిండేకు పట్టున్న థానేలో శివసేన లీడింగ్‌లో ఉన్నది. 131 వార్డులకు గాను 9 వార్డుల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక పుణెలో బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 32 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్‌లో ఉన్నది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మహారాష్ట్రలో మొత్తం 29 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయుతి కూటమి విజయం సాధించే అవకాశౄలు ఉన్నాయి. ముంబై మున్సిపాల్టీలో 52 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. శాంబాజీనగర్, నవీ ముంబై, వాసాయి విరార్, కళ్యాణ్ డోంబివిలీ, కోల్హాపూర్, నాగపూర్, సోలాపూర్, అమరావతి, అకోలా, నాషిక్, పింప్రి చించవాడ, పుణె, ఉల్లాస్‌నగర్, థానే, చంద్రాపూర్, పర్బనీ, మీరా భయాందర్, నాందేడ్, వాగాలా, పాన్వేల్, భీవండి-నిజాంపూర్, లాతూరు, మలేగావ్, సంగ్లీ-మిరాజ్-కుప్వాడ, జల్గావ్, అహల్యనగర్, దూలే, జాల్నా, ఇచల్కర్నిజి మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగాయి.