Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 4: కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ కమలం చేపట్టే ప్లాన్‌లో ఉన్నదనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందుకు ప్రతిగా రివర్స్ ఆపరేషన్ చేపట్టినట్టు కనిపిస్తున్నది. ‘ఆపరేషన్ హస్త’లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలైన మాజీ మంత్రి బీసీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే నరసింహ నాయక్.. కర్ణాటక కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. శనివారం కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా ఓ హోటల్లో జరిగిన పార్టీ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకొన్నది. అయితే తాము బీజేపీని వీడటం లేదని, శివకుమార్‌తో భేటీ యాధృచ్చికంగా జరిగిందని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. కాగా, బీజేపీ చేస్తున్న ఆపరేషన్ కమలం 2.0కు విరుగుడుగా కాంగ్రెస్ కూడా ఆపరేషన్ హస్త చేపట్టిందనే ఊహాగానాలు వస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగా బీజేపీ నేతలు తమ పార్టీలో చేరబోతున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఆపరేషన్ కమలం 2.0 గురించి వ్యాఖ్యానించారు. 17 మంది కాంగ్రెస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, సార్వత్రిక ఎన్నికల ముందు లేదా తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో కర్ణాటక రాజకీయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.