న్యూఢిల్లీ, మే 9: లోక్‌సభ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నవేళ.. వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మెల్ల మెల్లగా బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఓ బీజేపీ నేత మైనర్ అయిన తన కుమారుడితో కలిసి ఓటేయటమేగాక, దీన్ని వీడియో తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావటంతో.. రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఎన్నికల సంఘం దీనిపై ఇంకా స్పందించలేదు. బెరాసియా ప్రాంతానికి చెందిన వినయ్ మెహర్ బీజేపీ స్థానిక నేత. తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన తండ్రి స్థానంలో ఆ పిల్లాడు ఈవీఎం బటన్ నొక్కి కమలం గుర్తుకు ఓటు వేశాడు.
స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీసుకుంటూ ఓటేశానని చెబుతూ, ఫేస్బుక్లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ స్పందిస్తూ, ‘ఎన్నికల సంఘాన్ని పిల్లల ఆట వస్తువుగా బీజేపీ మార్చింది. బీజేపీ నేత వినయ్ మెహర్ తన ఓటు కుమారుడితో వేయించారు. ఆ తతంగాన్ని వీడియో తీసి, ఫేస్బుక్లో పోస్టు చేశారు. పిల్లల్ని, మొబైల్ ఫోన్లను లోపలికి ఎలా అనుమతించారు? దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా?’ అని కమల్‌నాథ్ ప్రశ్నించారు.
పోలింగ్ బూత్‌ను ఆక్రమించిన బీజేపీ నేత కుమారుడు
గుజరాత్లో బీజేపీ నేత కుమారుడు బూత్ ఆక్రమణకు పాల్పడ్డాడు. దీంతో ఆ పోలింగ్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. దాహోద్ లోక్‌సభ నియోజికవర్గ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ నేత కుమారుడు విజయ్ బాభోర్ పోలింగ్ బూత్‌ను ఆక్రమించటమేగాక, బోగస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడు. ఈసీ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. మహిసాగర్ జిల్లాలో సంత్రాంపూర్ తాలూకా పార్థంపూర్ పోలింగ్ స్టేషన్లో మే 7న జరిగిన పోలింగ్‌లో అవ కతవకలు జరిగాయని ఈసీ తేల్చింది. ఇక్కడ జరిగిన పోలింగ్‌ను రద్దు చేస్తూ, మే 11న తిరిగి పోలింగ్ చేపడుతున్నట్టు రాష్ట్ర సీఈవో తెలిపారు.