కోల్‌కతా, మే 7: తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రకాంత్ రథ్‌ను బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంపై కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందున్న బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన ఉత్తర 24 పరగణాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని భవానీపూర్‌లో ఓడించినందుకే తన పీఏను హత్య చేశారని ఆరోపించారు.
ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని ఆయన పేర్కొన్నారు. అతనిపై 4 బుల్లెట్లు కాల్చినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిందని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, దోషులను తప్పక శిక్షిస్తానని సువేందు పేర్కొన్నారు. కాగా, బుధవారం రాత్రి 10.30 గంటలకు మధ్యమ్‌గ్రామ్‌లోని దోతాల సమీపంలో మోటరు సైకిల్‌పై రథ్ కారును వెంబడించి వచ్చిన దుండగులు బలవంతంగా కారును ఆపి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని, అతను దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.