లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు ప్రత్యర్ధి పార్టీలు, నేతలపై విరుచుకుపడుతున్నారు. ఫరక్కాబాద్‌లో జరిగిన ర్యాలీలో యూపీ బీజేపీ యువజన విభాగం చీఫ్ ప్రన్షు దత్ ద్వివేదీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ని బహిరంగంగా హెచ్చరించారు.
కాషాయ పార్టీ కార్యకర్తలను విడిచిపెడితే వారు ఎస్పీని అంతం చేస్తారని ద్వివేది వ్యాఖ్యానించారు. బీజేపీ నేత వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి పాలనా పగ్గాలు చేపట్టాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అఖిలేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న యాత్రకు మంచి స్పందన లభిస్తుండటంతో ఎస్పీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి.
తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు నిరాటంకంగా తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేపడతామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. బీజేపీ అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండగా ఇటావా ఇతర జిల్లాల్లో విద్యుత్ ప్లాంట్లను నిర్మించి చవకగా, నిరాటంకంగా అన్ని వర్గాలకు విద్యుత్ సరఫరా చేపడతామని అఖిలేష్ ట్వీట్ చేశారు.