న్యూఢిల్లీ, ఆగస్టు 5: గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు ఉన్న ప్రదీప్ సిన్హ్ వాఘేలా పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసినట్టు శనివారం ప్రకటించారు. పార్టీ పదవి నుంచి తప్పుకోవాలని అధిష్ఠానం ఆదేశించిందని ఆయన మీడియాకు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రధాని మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్లో..అధికార బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్‌కు, ప్రదీప్ సిన్హాకు మధ్య గత కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తున్నది. దక్షిణ గుజరాత్లో సీఆర్ పాటిల్‌కు వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటును లేవదీశారని ప్రదీప్ సిన్హాపై స్థానిక మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా వాఘేలాపై నిషేధం విధించినట్టు తెలిసింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ పదవిని కోల్పోవటం గమనార్హం. రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా సీఆర్ పాటిల్ పగ్గాలు చేపట్టాక..జనరల్ సెక్రెటరీలతో కుమ్ములాటలు పెరిగాయి. పార్టీ పదవుల్ని అమ్ముకున్నారని, పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని కొంతమందికి కీలక పదవులను కట్టబెట్టాడని సీఆర్ పాటిల్‌పై ఆరోపణలున్నాయి. స్వంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఇలా ఆరోపించటం.. వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపింది.