బెంగళూరు: ముడా కుంభకోణం నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్యను తప్పిస్తే తనను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్న మంత్రి సతీశ్ జార్కిహోళితో సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర భేటీ అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి ప్రధానంగా పోటీ పడుతున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ సైతం జార్కిహోళిని కలిశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఊహాగానాలకు తెరలేశాయి. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి మంత్రిని కలిసినట్టు ఇద్దరు నేతలు చెప్పినప్పటికీ అంతర్గతంగా ముఖ్యమంత్రి మార్పుపైనే చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతున్నది. కాగా, ఇటీవల సతీశ్ జార్కిహోళి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసొచ్చారు. సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పిస్తే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని సతీశ్ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సయోధ్య కోసమే ఆయనతో డీకే సోదరుడు భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతున్నది.