Madhya Pradesh | హైదరాబాద్, అక్టోబర్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకొనేందుకు బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ప్రజాగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించిన కమలం పార్టీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలకు దిగింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల రూ.23 వేల కోట్ల ఎన్నికల తాయిలాలు ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి చెల్లిస్తామంటూ ‘లాడ్లీ బెహనా యోజన’ పథకాన్ని ప్రారంభించారు. దీనికితోడు విద్యార్థినులకు స్కూటీల కోసం ఆర్థిక సాయం చేస్తామని గత ఆగస్టులో సీఎం చౌహాన్ ప్రకటించారు.
లాడ్లీ బహనా పథకానికి ఏడాదికి రూ.19 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలో దీనికి నిధులు సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం ఇతర పథకాలకు నిధుల విడుదలను నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి 130కి పైగా పథకాలకు బీజేపీ సర్కార్ నిధులను ఆపేసింది. ఈ మేరకు 41 శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆయా పథకాలకు నిధులు విడుదల చేసేముందు తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతులు పొందాలని అందులో పేర్కొన్నది.
రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే లోటులో కొనసాగుతున్నది. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆదాయం 2.25 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఏడాది 54 వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3.32 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం 2024, మార్చి 31 నాటికి అప్పులు 3.85 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. గత 20 ఏండ్ల గణాంకాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్ల నుంచి 3.85 లక్షల కోట్లకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మధ్యప్రదేశ్లోని తలసరి అప్పు రూ.3,300 నుంచి రూ.50 వేలకు పెరిగింది. ఈ క్రమంలో ఎన్నికల ముందర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అలవికాని హామీలపై విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా ఎడాపెడా హామీలు ఇస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రతి నెలా ‘నారీ సమ్మాన్ యోజన’ కింద రూ.1,500 ఇస్తామని పార్టీ పెద్దలు ఇటీవల ప్రకటించారు. మరిన్ని పథకాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉంటాయని ఊదరగొడుతున్నారు.