Bhupinder Singh Hooda | హర్యానాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజల హక్కులపై బీజేపీ దాడులు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హుడా ఆరోపించారు. ఎస్సీలు, ఓబీసీల వ్యతిరేక మనస్తత్వంతో బీజేపీ బాధ పడుతున్నదని చెప్పారు. స్కిల్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వోద్యోగాలకు స్వస్తి పలకడమే దీనికి కారణం అని పేర్కొన్నారు. నిరంతరం ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తున్నదని, వాటిని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నదని ఆరోపించారు. ‘ఒకవేళ ప్రభుత్వోద్యోగాలను, ప్రభుత్వ విద్యా సంస్థలను రద్దు చేస్తే ఎస్సీలు, ఓబీసీల రిజర్వేజన్లు ఆటోమేటిక్ గా రద్దవుతాయి’ అని పేర్కొన్నారు.
బలహీన వర్గాలకు అన్ని వర్గాల కాంగ్రెస్ పార్టీ అండదండలు అందిస్తున్నదని భూపీందర్ సింగ్ హుడా చెప్పారు. ఈ వర్గాలు దూరమైనప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైతే బలహీన వర్గాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆదివారం గురు దక్ష్ ప్రజాపతి మహారాజ్ జయంతి వేడుకల్లో భూపీందర్ సింగ్ మాట్లాడుతూ చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ ఎత్తేయడానికి క్రిమీ లేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.6 లక్షలకు కుదించి వేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే క్రిమీ లేయర్ పరిమితిని రూ.8 లక్షలకు పెంచుతూ బీజేపీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.