న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. కేవలం కేరళలో మాత్రమే కాదని, దేశంలోని అన్ని బీజేపీయేతర మతఘర్షణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు.
మత ఘర్షణలపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధాని మోదీగానీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని ఏచూరి విమర్శించారు. పైగా ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు కళంకం అంటగట్టడంలో బీజేపీ మాత్రమే ఎక్స్పర్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్ అనుసరించిన తీరుపై కూడా ఏచూరీ విమర్శలు చేశారు.
అదానీ అవినీతిపై సభలో చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆర్టికల్ 267 కింద తీర్మానాలు సమర్పించడంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. సభ్యులు ప్రతిరోజు నోటీసులు ఇచ్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏచూరి మాట్లాడుతూ.. సభ్యులు రోజూ నోటీసులిస్తున్నారని రాజ్యసభ చైర్మన్ ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఎంపీలు రోజూ తీర్మానాలు ఇవ్వవచ్చని రాజ్యసభ నిబంధనలే చెబుతున్నాయని ఆయన చెప్పారు.