రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ప్రకటనను హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీపై బీజేపీ తమ చోటా నాయకులచే అనుచిత వ్యాఖ్యలు చేయిస్తోందని ఆరోపించారు. సుఖ్వీందర్ బుధవారం సిమ్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉండగా రవ్నీత్ సింగ్ రాహుల్ గాంధీని పొగుడుతూ పాటలు పాడేవారని గుర్తుచేశారు. ఎంపీ కాకుండానే ఇప్పుడు ఆయన బీజేపీ ప్రభుత్వంలో మంత్రి కాగానే రాజ్యసభ సభ్యత్వం కోసం బీజేపీ దృష్టిని ఆకర్షించేందుకు జాతీయ నేతపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి నేతలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదుపులో పెట్టాలని హితవు పలికారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది కాషాయ పార్టీ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని దుయ్యబట్టారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన చేపట్టారు.
మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ అన్నారు. విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు.
Read More :
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!