బెంగళూరు, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ కర్ణాటకను కళ్యాణ కర్ణాటకగా మార్చి నిజాం పరిపాలన మానసిక బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించామని బీజేపీ చేస్తున్న ఎన్నికల ప్రచారం ఫలించడం లేదు. హిందువులు, ముస్లింల మధ్య అంతరాల్ని పెంచి, హిందువుల్ని సంతృప్తి పరచేందుకు పన్నిన పన్నాగాలూ పారలేదు. దీంతో అళంద్లోని ఒకప్పటి హిందువుల ఆలయాన్ని దర్గాగా మార్చారని, అంజనాద్రి గుట్ట ఆంజనేయుడి జన్మస్థలమని బీజేపీ అనుకూల హిందూ సంస్థలు ప్రచారం చేప్టటాయి. ఈ రెండు ప్రచారాలు వివాదం కావడంతో బీజేపీకి కళ్యాణ కర్ణాటకలో ఎదురు గాలి వీస్తున్నది.
2008 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ధన సహాయం చేసిన ఇనుప గనుల యజమాని గాలి జనార్దన రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో సొంత పార్టీ స్థాపించి బరిలోకి దిగడంతో బీజేపీ ఓట్లకు గండి పడటం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ‘నేను కళ్యాణ కర్ణాటకలో పుట్టినవాడిని. మా పార్టీ అభ్యర్థులకు ఓటేసి మీ బిడ్డను గెలిపించండి’ అని జోరుగా చేస్తున్న ప్రచారం కూడా బీజేపీ గెలుపు అవకాశాలను దెబ్బ తీసేలా ఉన్నాయి.