హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీకి.. అభ్యర్థుల ఎంపిక అగ్నిపరీక్షగా మారింది. సొంత పార్టీ నేతల మీద నమ్మకం లేక ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకులకే టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నది. తొలి విడతలో 69 మంది అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో 40 మంది అభ్యర్థులు విశ్వహిందూ కార్యకర్తలే. 38 మంది సిట్టింగ్‌లకు మొండి చెయ్యి చూపింది. అందులో మోర్బి ఎమ్మెల్యే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కాంతీభాయ్కి టికెట్ దక్కింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన 17 మందికి టికెట్లు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ నీమాబెన్ ఆచార్యకు, ఏడుగురు మాజీ మంత్రులకు టికెట్ దక్కలేదు. మాజీ సీఎం నితిన్ పటేల్, మాజీ మంత్రులు ఆర్ఎస్ ఫాల్దూ, భూపేంద్ర సింహ్ చుడాసమా, సౌరభ్ పటేల్, కౌషిక్ పటేల్, వాసన్ ఆహిర్, ధమేంద్ర సిన్హ్ జడేజాకు టికెట్ ఇవ్వలేదు. మంత్రులు ప్రదీప్ పర్మార్, బ్రజేష్ మెర్జా, అరవింద్ రయానీ, ఆర్సీ మక్వానాకు మొండిచెయ్యి చూపింది. పాటీదార్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌తో పాటు పలువురు కొత్తవారికి టికెట్లు దక్కాయి. వీహెచ్‌పీ, స్వామినారాయణ ట్రస్టు, పాటీదార్ కులదైవం ట్రస్ట్‌లలో క్రియాశీలంగా పనిచేసేవారికి టికెట్లు ఇచ్చింది.