న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : పాత విద్యుత్తు మీటర్ల స్థానంలో కొత్త స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయించాలని విపక్ష రాష్ర్టాలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒత్తిడి తెస్తున్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితులు సహా సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. అయితే, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రం స్మార్ట్ మీటర్ల ఏర్పాటును పట్టించుకోవడం లేదు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాల కంటే వెనుకంజలో ఉంది. పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనైతే ఇంత వరకు ఒక్క స్మార్ట్ మీటరు కూడా ఏర్పాటు చేయలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
డిస్కమ్‌ల సరఫరా, నిర్వహణ సామర్థ్యం పెంచేందుకు కేంద్రం 2021 జూలైలో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్) పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా స్మార్ట్ మీటరింగ్ నేషనల్ ప్రాజెక్ట్ (ఎస్ఎంఎన్పీ) చేపట్టి స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. స్మార్ట్ మీటర్లతో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకతకు దారి తీస్తున్నది. గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు పలుమార్లు రోడ్డెక్కారు. దీంతో బీజేపీ వెనకడుగు వేసింది.
గుజరాత్‌కు మొత్తం 1.64 కోట్ల స్మార్ట్ మీటర్లు మంజూరు కాగా కేవలం 2.19 లక్షల మీటర్లను మాత్రమే బిగించారు. పాత మీటర్ల స్థానంలో కాకుండా కొత్త విద్యుత్తు కనెక్షన్లకే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్, గోవా, మణిపూర్ లాంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనైతే స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అసలే ప్రారంభించలేదు. కాగా, స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో అస్సాం మొదటి స్థానం లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ, యూపీ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 19.79 కోట్ల స్మార్ట్ మీటర్లు మంజూరు కాగా నవంబర్ 29 నాటికి కేవలం 72.97 లక్షలు(3.7%) మాత్రమే ఏర్పాటయ్యాయి.