BJP | న్యూఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసారి బీజేపీ ఓడిపోబోతున్నదని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టనున్నట్టు అంచనా వేశాయి. ఇక, జమ్ము కశ్మీర్‌లోనూ అధికారంపై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక్కడ కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి రానున్నట్టు పలు సంస్థలు అంచనా వేయగా, హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఇంకొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ముగిసింది. మొత్తం 90 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. దాదాపు 65 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్ఎల్డీ – బీఎస్పీ కూటమి, జేజేపీ – ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి కూడా పోటీలో ఉన్నాయి. అక్టోబరు 8న కౌంటింగ్ జరగనుంది.