ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన అని, శివసేనకు చెందిన విల్లు-బాణం గుర్తు కూడా షిండే వర్గానికే చెందుతుందని శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పడాన్ని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఈసీ ప్రకటన ప్రజస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడుతోంది. తాజాగా ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన ప్రియాంకా చతుర్వేది ఈసీపై ధ్వజమెత్తారు.
స్వతంత్ర సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం అసలైన శివసేన పార్టీ ఎవరిదో తేల్చే విషయంలో అనుసరించిన తీరు చాలా ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉందని ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు. ప్రజస్వామ్యాన్ని, చట్టాన్ని, కాపాడాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీఐ అంటే ‘ఎంటైర్లీ కాంప్రమైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అన్నట్లుగా దాని పనితీరు ఉన్నదని ఆమె ఎద్దేవా చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని (ఈసీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను (సీబీఐ) తన ఎలక్షన్ టూల్కిట్స్గా మార్చుకుందని, ఇక దాని కన్ను న్యాయవ్యవస్థపై పడిందని ఆమె ఆరోపించారు. న్యాయవ్యవస్థను కూడా చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.