న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని సమర్థంగా నిర్మూలించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తాత్కాలిక స్పందనలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు బుధవారం విచారణ జరిపింది. గుర్గావ్లోని ఎంసీడీ టోల్ కారణంగా వాహనాలు బారులుతీరి గంటల కొద్దీ నిలబడి పోవడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోందన్న వాదనపై ధర్మాసనం స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న 9 టోల్ ప్లాజాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసే విషయాన్ని పరిశీలించాలని డీఎంసీని కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోపల దీనిపై నిర్ణయం తీసుకుని తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. కాలుష్య ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బాధిత కార్మికులకు ప్రత్యామ్నాయ పనులు చూపేందుకు ప్రయత్నించాలని కోరింది. మొత్తం బాధిత కార్మికులు 2.5 లక్షల మంది ఉండగా వారిలో 7,000 మందిని గుర్తించామని, వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కాలుష్య నియంత్రణ చర్యలు సక్రమంగా అమలు కాకపోవడం వెనుక సంపన్నుల జీవనశైలి కూడా కారణమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీఎస్-4 దిగువన ఉన్న వాహనాలపై చర్యలు
దేశ రాజధానిలో వాయు ప్రమాణాలు అధ్వానంగా మారిన నేపథ్యంలో బీఎస్ 4 ప్రమాణాల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న కాలం తీరిన వాహనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న పాత, బీఎస్3 ప్రమాణాల వరకు ఉన్న వాహనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వీలుగా గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఢిల్లీ ప్రభుత్వం అభ్యర్థనను ధర్మాసనం మన్నించింది. బీఎస్ 4 ప్రమాణాలతో కూడిన వాహనాలు 2010లో వచ్చాయని, బీఎస్ 3 మోడల్ అంతకన్నా ముందుదని సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం, బీఎస్ 4 వాహనాలు, అంతకన్నా కొత్త వాహనాలపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని ధర్మాసనం ఆదేశించింది.
డిజిటల్ అరెస్ట్ బాధితులకు నష్టపరిహారం!
డిజిటల్ అరెస్ట్ వంటి ఆన్లైన్ మోసాల బాధితులకు నష్టపరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హర్యానాకు చెందిన వృద్ధ దంపతుల ఫిర్యాదుపై స్వీయ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. సైబర్ క్రిమినల్స్ పెద్ద ఎత్తున సొమ్మును దేశం వెలుపలకు తరలిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నేరాలపై వ్యవహరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల సంయుక్త సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయబోతున్నదని అటార్నీ జనరల్ తెలిపారు.