దేశంలో ధరల మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కొలువుల కల్పన లేకపోగా ఉద్యోగ భద్రత కూడా కరువవడం యువతను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇండియాటుడే నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీ సర్కారు వైఫల్యాలపై ప్రజలు కుండబద్దలు కొట్టారు. మోదీ పాలనలో కార్పొరేట్లకే ఎక్కువ లబ్ధి కలిగిందని 61శాతం మంది అభిప్రాయపడ్డారు.
‘అచ్చేదిన్ తెస్తాం.. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ పదకొండేండ్ల కిందట అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలందరూ అరిగోస పడుతున్నారు. ధరల మోతతో సామాన్యుడి బతుకు దిన దిన గండం నూరేండ్ల ఆయుష్షుగా మారింది. పెరిగిన నిరుద్యోగంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతీ, యువకులు సతమతమవుతున్నారు. దీంతో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడంలో, ఉద్యోగ కల్పనలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమయ్యిందంటూ మెజారిటీ ప్రజలు మండిపడుతున్నారు. ఈ మేరకు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియా టుడే, సీ-వోటర్ సంయుక్తంగా చేసిన ఇటీవలి సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
-స్పెషల్ టాస్క్ బ్యూరో
PM Modi | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కొండెక్కిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉద్యోగ కల్పన మృగ్యమవ్వడంతో దేశంలోని యువతరమంతా సతమతమవుతున్నది. పదకొండేండ్ల బీజేపీ పాలనలో ధరలు, నిరుద్యోగమే అతిపెద్ద సమస్యలని, వీటిని పరిష్కరించడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమయ్యిందని తాజాగా తేలింది. ఈ మేరకు ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరిట ఇండియాటుడే, సీ-వోటర్ సంయుక్తంగా ఫిబ్రవరిలో చేసిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
దేశ ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలేమిటని సర్వే ప్రతినిధులు ప్రశ్నించగా.. మెజారిటీ ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదల తమకు ఇబ్బందిగా మారినట్టు అభిప్రాయపడ్డారు. 11 ఏండ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అతిపెద్ద వైఫల్యాలుగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి రెండు అంశాలు నిలిచినట్టు ఏకంగా 42 శాతం మంది పేర్కొన్నారు. మత కల్లోలాల నియంత్రణలోనూ, మైనార్టీల భద్రతను చేపట్టడంలోనూ, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బీజేపీ సర్కారు విఫలమయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు.