BJP Rekha gupta | అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ మరోసారి అడ్డదారులు వెతుకుతున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ నేతలకు ఇంకా అధికార దాహం తీరడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్నది. అధికారంలోకి వచ్చేందుకు కావాల్సినంత సంఖ్యాబలం లేనప్పటికీ.. మేయర్ అభ్యర్థిని రంగంలోకి దింపింది. దీని ద్వారా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న బీజేపీ ఎత్తుగడ స్పష్టమవుతున్నది. ఇప్పటికే ఓ స్వతంత్ర కౌన్సిలర్‌కు గాలం వేసిన బీజేపీ అధిష్ఠానం.. మరింత మందిని తమ వైపునకు తిప్పుకునేందుకు బేరసారాలకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల తర్వాత మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రణాళికలను బీజేపీ చెడగొట్టేందుకు సిద్ధమైంది. మేయర్ ఎన్నికను ఏకపక్షంగా గెలుస్తామన్న ఆప్ ఆశలపై నీళ్లు చల్లేందుకు కౌన్సిలర్ల వేటలో బీజేపీ పడింది. ఎంసీడీ మేయర్ పదవికి రేఖా గుప్తా పేరును బీజేపీ నిర్ణయించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కమల్ బాగ్రీ, స్టాండింగ్ కమిటీ అభ్యర్థిగా కమల్జిత్ సెహ్రావత్ పేర్లను బీజేపీ ప్రకటించింది.
బీజేపీలోకి స్వతంత్ర కౌన్సిలర్..
మేయర్ ఎన్నికలకు ముందు స్వతంత్ర కౌన్సిలర్ గజేంద్ర దారల్ సోమవారం బీజేపీలో చేరారు. ఆయన ముండ్కా నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. సోమవారం బీజేపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్ గజేంద్ర దారాల్ కూడా బీజేపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థిగా ఉన్నారు. కాగా, మేయర్‌గా షైలీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా ఆలే మహమ్మద్ ఇక్బాల్ పేర్లను ఆప్ ఇప్పటికే ఖరారు చేసింది.
ఆప్ సవాల్ కొంప ముంచనున్నదా..?
ఢిల్లీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం కోసం స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నదని రెండ్రోజుల క్రితం ఆప్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థిని రంగంలో దింపేందుకు బీజేపీ భయపడుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. దమ్ముంటే మేయర్ పదవికి సొంత అభ్యర్థిని నిలబెట్టాలని ఆయన సవాల్ చేశారు. ఇది జరిగిన రెండు రోజులకు బీజేపీ ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. ఒక స్వతంత్ర అభ్యర్థిని తమ వైపునకు తిప్పుకున్న బీజేపీ.. మేయర్ ఎన్నికల్లో తమ గత పద్ధతులను అమలుచేసేలా ప్లాన్ చేసింది.
కాగా, ఎంసీడీ మేయర్ ఎన్నిక జనవరి 6న జరగనున్నది. 250 స్థానాలకు జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఆప్ కు 134 సీట్లు రాగా, బీజేపీ అభ్యర్థులు 104 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు 9 మంది విజయం సాధించారు. 15 ఏండ్ల పాటు ఎంసీడీని పాలించిన బీజేపీ.. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది.