భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో బీజేపీ కౌన్సిలర్ అశోక్ సింగ్ ఓ మహిళపై అత్యాచారం చేసి, తనను ఎవరూ ఏం చేయలేరని బెదిరించాడు. బాధితురాలు సాత్నా జిల్లా ఎస్పీకి ఈ నెల 22న ఫిర్యాదు చేశారు. అశోక్ సింగ్ తనను ఆరు నెలల నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. కత్తితో బెదిరించి తనపై ఆయన అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ దుశ్చర్యను ఆయన రికార్డ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. అనైతిక సంబంధాలు పెట్టుకునే విధంగా తనను ఆయన అనేకసార్లు నిర్బంధించాడని చెప్పారు. తాను ప్రతిఘటించినపుడు తనను చంపుతానని బెదిరించేవాడని తెలిపారు. ఈ నెల 26న సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో అప్లోడ్ అయింది.
ఓ దుకాణం వద్ద కూర్చున్న సింగ్ బాధిత మహిళతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. తీవ్ర అభ్యంతరకర భాషను ఉపయోగించి, ఆమెను వేధించినట్లు కనిపించింది. ఈ అరాచకాలను సామాజిక మాధ్యమాల్లో బయటపెడతానని ఆమె అతనిని హెచ్చరించింది. అందుకు అతను బదులిస్తూ, “నన్ను ఎవడూ ఏం చేయలేడు” అని గద్దించినట్లు కనిపించింది. బాధితురాలు స్పందిస్తూ, “నేను ఎంత ఎక్కువగా ఏడిస్తే, నువ్వు అంత ఎక్కువగా ఏదో ఓ రోజు ఏడవవలసి ఉంటుంది” అని హెచ్చరించారు. ఇప్పుడే ఎస్పీ ఆఫీస్‌కి వెళ్తానని చెప్పారు. నిందితుడు మాట్లాడుతూ, “నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లు, నేనేం తప్పు చేయలేదు. ఏమీ జరగదు” అన్నాడు. ఈ వీడియో వైరల్ అవడంతో, రాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.