ముంబై : ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాయు నాణ్యతను పెంచడానికి రద్దీ పన్ను విధించాలని కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ మకరంద్ నర్వేకర్ నగర పాలక సంస్థకు ప్రతిపాదించారు. దక్షిణ ముంబైలో రద్దీగా ఉండే నారీమన్ పాయింట్, కొలబా, ఫోర్ట్ వంటి ప్రాంతాల్లో రద్దీ సమయాల్లో ఒంటరిగా వాహనాలు నడిపే ప్రైవేట్ డ్రైవర్లకు ఈ పన్ను విధించాలని ఆయన కోరారు. ఈ పన్నులతో వచ్చే ఆదాయాన్ని నగరంలో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని సూచించారు.
ఒంటరిగా వాహనాలు నడిపే ప్రైవేట్ డ్రైవర్లకు రూ.50-రూ.100 వరకు రద్దీ పన్ను విధించాలని సూచించారు. ఫాస్టాగ్ విధానం, సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ లాంటి సాంకేతికత సాయంతో ఈ పన్ను విధింపును అమలు చేయాలని కోరారు. రద్దీని నియంత్రించడానికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మొబిలిటీ ఫోరం సభ్యుడు ఏవీ షెనాయ్ సూచించారు.