లక్నో: బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’పై ఆయన ఈ మేరకు స్పందించారు. విరామం తర్వాత జనవరి 3న ఢిల్లీ నుంచి తిరిగి కొనసాగనున్న ఈ యాత్ర అనంతరం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న యూపీకి చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గోవాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను ఈ ఆహ్వానం గురించి మీడియా అడిగింది.
కాగా, అఖిలేష్ యాదవ్ భిన్నంగా సమాధానం ఇచ్చారు. ‘మా పార్టీది భిన్నమైన సిద్ధాంతం. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే’ అని తెలిపారు. అంతటితో ఆగక ‘మీ ఫోన్లో ఆహ్వానం ఉంటే, దయచేసి నాకు పంపండి’ అని విలేకరులతో అన్నారు. ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. అయితే తమ మనోభావాలు వారి (కాంగ్రెస్) యాత్రతో ఉంటాయని అన్నారు.