న్యూఢిల్లీ, జూలై 13: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఐఎస్ఐ సంస్థ కోసం పనిచేసిన పాకిస్థాన్ జర్నలిస్టును భారత్కు పిలిపించుకునే వారంటూ వ్యాఖ్యానించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. నుస్రత్ మీర్జా అనే జర్నలిస్టుతో అన్సారీ.. దేశానికి సంబంధించిన అనేక సున్నితమైన, రహస్య వివరాలు వెల్లడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా ఇరాన్లో భారత రాయబారిగా ఉన్న సమయంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరించారని ఆర్ఏడబ్ల్యూ (రా) మాజీ అధికారి ఒకరు తెలిపిన విషయాన్ని ఉటంకించారు. కాగా, బీజేపీ ఆరోపణలను హమీద్ అన్సారీ కొట్టిపారేశారు. బీజేపీది తప్పుడు ప్రచారం అని ఖండించారు.