MLA Ravikumar Gowda | మాండ్య, ఆగస్టు 25: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ బీజేపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో ప్రయత్నాలు చేస్తున్నదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేస్తున్నదని అన్నారు. అయితే బీజేపీ కుట్రలు ఫలించవని, తమ ప్రభుత్వం స్థిరంగా, బలంగా ఉన్నదని చెప్పుకొచ్చారు. మాండ్యలో ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ డబ్బుల ఆఫర్‌ను రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచిందన్నారు. రెండు రోజుల క్రితం తనకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడని, రూ.100 కోట్లు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. 50 మందిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ వ్యక్తి చెప్పాడని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రతి రోజూ కుట్రలు చేస్తూనే ఉన్నదని, ఆ పార్టీ ‘బ్రోకర్లు తమ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని అన్నారు. తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఆడియో తన వద్ద ఉన్నదని, మిగతా ఆధారాలు కూడా సేకరించి ఈడీ, సీబీఐలకు ఇస్తామన్నారు. డబ్బు సంచులతో వారిని పట్టుకోవాలని అనుకొంటున్నామని తెలిపారు.
వాళ్లంతా ఒక గ్యాంగ్!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, ప్రహ్లాద్ జోషి, హెచ్డీ కుమారస్వామిలు ఒక ‘గ్యాంగ్’గా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్ గౌడ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని వీరంతా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు హామీ ఇచ్చారని, ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ఒక టీమ్ ప్రయత్నించిందని, రూ.50 కోట్ల డబ్బుతో పాటు మంత్రి పదవులు ఆఫర్ చేసిందని గత ఏడాది అక్టోబర్‌లో రవికుమార్ గౌడ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలను ఈ విధంగా సంప్రదించారని, ఈ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.