విద్రోహ పర్వానికి మరాఠా గర్వం మర్యాద జవాబు
హిందూత్వను వదలను.. బీజేపీకి లొంగను
నేను బాల్‌ఠాక్రే బిడ్డను పదవి నాకు ముఖ్యం కాదు..
మరాఠా సీఎం ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగ ప్రకటన
రాజీనామాకు ముందే అధికార నివాసం ఖాళీ
శాసనసభ రద్దు కావచ్చేమో: సంజయ్ రౌత్
ఆ నాటి మాట ఏమైంది?
సీన్-1
అది 2015. బీహార్ ఎన్నికలు. జేడీయూ, ఆర్జేడీ కలిసి పోటీచేశాయి. మెజారిటీ సీట్లు రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీశ్ సీఎం అయ్యారు. అయితే రెండేండ్లు గడిచిందో లేదో.. బీజేపీ తన ఆపరేషన్ ప్రారంభించింది. నితీశ్‌ను తన వైపునకు తిప్పుకొన్నది. దీంతో ప్రీపోల్ మిత్రుడు ఆర్జేడీతో తెగదెంపులు చేసుకొన్న నితీశ్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ దృష్టిలో నితీశ్ చేసింది కరెక్ట్.
సీన్-2
2019.. మహారాష్ట్ర ఎన్నికలు. శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కాయి. అయితే, సీఎం పదవిపై భేదాభిప్రాయాలు రావడంతో ప్రీపోల్ మిత్రుడు బీజేపీని కాదని, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ దృష్టిలో ఠాక్రే చేసింది ద్రోహం.
లాజిక్
అప్పుడు నితీశ్ చేసింది కరెక్ట్ అయితే, ఇప్పుడు మహారాష్ట్రలో ఠాక్రే చేసిందీ కరెక్టే! ఠాక్రే చేసింది తప్పయితే అప్పుడు నితీశ్ చేసిందీ తప్పే! కానీ బీజేపీకి ఈ తప్పొప్పుల తర్కం ఎంత మాత్రం సరిపడదు. ఒక్క సీటు లేకున్నా అధికారంలోకి (సిక్కింలో లాగా) రావడమే దాని వైఖరి. రాష్ర్టానికో సిద్ధాంతం.. పార్టీకో వైఖరి.. పూటకో మాట.. ఇదీ విలువల పార్టీ బీజేపీ ప్రవచించే సిద్ధాంత రాద్ధాంతం.
సాధారణంగా అసంతృప్తి ఉన్న నేతలు తమ సమస్యలేవో చెప్తారు…అంతే తప్ప నువ్వు ఫలానా పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలి అని షరతులు పెడుతున్నారంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి?
అస్మిత ( ఆత్మగౌరవం) గుజరాత్‌కు మాత్రమే కాదు; మహారాష్ట్రకు, ఆ మాటకొస్తే ప్రతి రాష్ర్టానికీ ఒక ‘స్వాభిమాన్’ ఉంటుందని అర్థం చేసుకోలేని వాళ్లు.. దశాబ్దాల సైద్ధాంతిక సారూప్యతకన్నా ఫిరాయింపుల సాయంతో గద్దెనెక్కాలనుకున్న వాళ్లు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నందుకు మనం ఎలా సిగ్గు పడాలి?
దేశభక్తిలో బాలాసాహెబ్ ఎప్పుడూ రాజీ పడలేదు. నాకు ఆయన మార్గదర్శకుడు. బాలాసాహెబ్ ఉన్నంత వరకు మాకు ఎలాంటి చింత లేదు. ఇప్పుడు మాకు మరింత బాధ్యత పెరిగింది. బాలాసాహెబ్ ఎక్కడున్నా ఆయనకు సంతోషం కలిగించేలా పని చేయాల్సిన బాధ్యత మామీద ఉన్నది.
– 2019 మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ
బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది. గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డిదారిన పగ్గాలు చేపట్టడమే విజయ వైభోగంగా భావించే కమలదళం.. అధికారం కోసం మాజీ మిత్రుడు శివసేనను వెన్నుపోటు పొడిచింది. తనను కాదని వైరివర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందంటూ గురివింద నీతులు చెప్పింది. చివరకు ఉద్ధవ్ పార్టీపై విషాన్ని చిమ్మి ఎమ్మెల్యేలకు వల వేసింది. అయితే ఇంత జరిగినా శివసైనికులు తమ హుందాతనాన్ని, స్వాభిమానాన్ని విడిచిపెట్టలేదు. బీజేపీ కూటనీతిని గ్రహించినప్పటికీ, మరాఠా బెబ్బులి బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతో సంయమనంతో గౌరవపూర్వకంగా వ్యవహరించారు. పదవి కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని, అవసరమైతే సీఎం పదవిని తృణప్రాయంగా వదులు కొనేందుకు సిద్ధమేనని చెప్పారు. ఏ శివసైనికుడు సీఎం అయినా తనకు సంతోషమేనంటూ.. రాజీనామాకు ముందే అధికార నివాసాన్ని ఖాళీచేసి వెళ్లిపోయారు.
ముంబై, జూన్ 22: మాజీ మిత్రుడు, ఘనత వహించిన సిద్ధాంతాల పార్టీగా చెప్పుకునే బీజేపీ చేతిలో మరాఠా పౌరుషం తల్లడిల్లిపోతున్నా.. రాజకీయ సంక్షోభం కుదిపేస్తున్నా.. మరాఠా బెబ్బులి బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతో హుందాగా వ్యవహరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై తొలిసారిగా స్పందించారు. శివసేన ఎప్పుడూ హిందూత్వను వదిలిపెట్టలేదని, పదవి కోసం తాము వెంపర్లాడే వాళ్లం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘హిందూత్వ మా ఊపిరి. అదే మా గుర్తింపు, అదే మా భావజాలం. బాలాసాహెబ్ హిందూత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నేను ప్రయత్నిస్తా. శివసేన ఎప్పుడూ హిందూత్వను విడిచిపెట్టలేదు’ అన్నారు. ‘
నన్ను అసమర్థుడు అని ఒక్క ఎమ్మెల్యే అన్నా.. సీఎం పదవికి రాజీనామా చేస్తా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకున్నా. నేను బాల్‌ఠాక్రే కొడుకుని. పదవుల కోసం వెంపర్లాడను. రాజీనామాకు ఎప్పుడైనా సిద్ధమే. నా తర్వాత శివసేన నేత సీఎం అయితే ఆనందిస్తా. పవార్ కోరడంతోనే సీఎం పదవిని అధిష్టించా. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాం. సీఎం పదవి కోసం పోరాటం చేయను. సీఎంగా నా బాధ్యతను పూర్తిగా నిర్వర్తించా. కొందరు ప్రేమతో గెలిస్తే.. మరికొందరు కుట్రలతో గెలుస్తారు. నాకు సీఎంగా కొనసాగాలని లేదు’ అని పేర్కొన్నారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవిని విడిచిపెట్టడానికి కూడా సిద్ధమేనన్నారు. ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వద్దనుకుంటే అది వేరే విషయమని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వద్దనుకుంటే ఏం అనగలనని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్.. కుటుంబసభ్యులతో కలిసి బాంద్రాలోని సొంత నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు. ఉద్ధవ్ మాతోశ్రీకి చేరుకోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. వీటిని శివసేన నేత సంజయ్‌రౌత్ ఖండించారు. సంకీర్ణ కూటమి సీఎంగా ఉద్ధవ్ కొనసాగుతారని, ఒకవేళ బలపరీక్ష జరిగితే తమ మెజారిటీని నిరూపించుకుంటామన్నారు.
శాసనసభ రద్దు!
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్నాథ్ షిండే తన వెంట 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బుధవారం ప్రకటించారు. తమదే అసలైన శివసేన అని స్పష్టంచేశారు. రెబల్ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా షిండేను ఎన్నుకున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరు కావాలని, లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోయినట్టుగా భావిస్తామని చీఫ్ విప్ సునీల్ ప్రభు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తిప్పికొట్టిన షిండే, సేన ఎమ్మెల్యే భరత్ గోగవాలేను సొంత చీఫ్ విప్‌గా నియమించినట్టు ప్రకటించారు. పార్టీలో తిరుగుబాటును తిప్పికొట్టేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్టు తెలుస్తున్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు దారికి రాకపోతే శాసనసభ రద్దయ్యే అవకాశం ఉన్నదని ఉద్ధవ్ సన్నిహితుడు, సేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ‘మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అసెంబ్లీ రద్దు దిశగా వెళ్తున్నాయి’ అన్నారు. మరోవైపు, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా సోకింది. దీంతో శాసన సభ రద్దుచేయాలని ముఖ్యమంత్రి భావించినా గవర్నర్‌ను కలువలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు, రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే బీజేపీతో శివసేన మళ్లీ జట్టుకట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ అన్నారు.
సీఎం అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లాను ఖాళీ చేసి వెళ్తున్న ఉద్ధవ్
బలవంతంగా తరలించారు
తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వెంట సూరత్ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్, మరో ఎమ్మెల్యే కైలాశ్ పాటిల్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. సూరత్‌లో తనను కొందరు వ్యక్తులు బలవంతంగా దవాఖానలో చేర్చి ఇంజెక్షన్లు ఇప్పించారని దేశ్‌ముఖ్ తెలిపారు. బుధవారం మహారాష్ట్ర తిరిగివచ్చిన ఆయన నాగపూర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో నేను ఒక శివ సైనికుడిని. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. మంగళవారం 20-25 మంది పోలీసులు, ఇతర వ్యక్తులు కలిసి నన్ను బలవంతంగా దవాఖానకు తరలించారు. నేను బాగానే ఉన్నానని చెప్పినా వినలేదు. గుండెపోటు వచ్చిందని చెప్పారు. బలవంతంగా ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారు. నా రక్తపోటు కూడా సాధారణంగానే ఉన్నది’ అని తెలిపారు. తనను కారులో బలవంతంగా తరలిస్తుండగా చాకచక్యంతో తప్పించుకున్నట్టు పాటిల్ తెలిపారు. అస్సాంలోని గువాహటిలో మకాం వేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు మహా అగాఢీ కూటమిలో భాగస్వామి అయిన ప్రహర్ జనశక్తి పక్ష్ నేత, రాష్ట్ర మంత్రి బచ్చుకాడు వెల్లడించారు. మరో నలుగురు శివసేన ఎమ్మెల్యేలు గువాహటిలోని షిండే క్యాంప్‌నకు చేరుకున్నట్టు సమాచారం. మరోవైపు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి 8 మంది శివసేన మంత్రులు హాజరు కాలేదు. కాగా, సమావేశానికి సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులంతా హాజరయ్యారు.
ఎంవీఏ అసహజమైనది
మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ‘అసహజమైనది’ అని శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే అన్నారు. కూటమి నుంచి శివసేన తప్పక బయటకు రావాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఇది అనివార్యం అని పేర్కొన్నారు. మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండున్నరేండ్లుగా శివసైనికులు చాలా క్షోభను అనుభవిస్తున్నారని చెప్పారు. ఎంవీఏ కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయోజనాల కోసమే ఏర్పడిందన్నారు.