Digital Arrests : దేశంలో గడిచిన కొన్ని నెలలుగా ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ మోసాలు పెరిగి పెనుముప్పుగా మారుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేకమంది ఈ మోసాల బారిన పడుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లను అరికట్టేలా కేంద్రం (Union Govt) పలు నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలకు సంబంధించిన నివేదికను తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ డిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్ (Biometric SIM verification), అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి ప్రతిపాదనలను కేంద్రం తన నివేదికలో పేర్కొన్నది.
వివిధ రంగాల నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్రం ఈ నివేదికను రూపొందించింది. తమ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రతిపాదనల అమలు కోసం టెలీకమ్యూనికేషన్ విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, ఆర్బీఐ అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఈ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ నివేదికలోని సిఫారసులను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించి సంబంధిత విభాగాలకు ఆదేశాలు ఇవ్వనుంది.