న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాల ముప్పును ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన బహుళ సంస్థల వ్యూహాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ వివరణాత్మక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై బయోమెట్రిక్ సిమ్ ధృవీకరణ నుంచి ఖాతాలపై తాత్కాలిక డెబిట్ నిలుపుదల వరకు పలు చర్యలను కేంద్రం తన నివేదికలో ప్రతిపాదించింది. బహుళ భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం రూపొందించిన ఈ నివేదిక భద్రతా చర్యల ఏకరీతి, కాలపరిమితితో కూడిన అమలును నిర్ధారించేలా టెలికమ్యూనికేషన్ల శాఖ(డీవోటీ), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(మీటీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహా కీలక అధికారులకు ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వం కోర్టును కోరింది. సిమ్ జారీకి జాతీయ స్థాయిలో పారదర్శకతను నిర్ధారించడానికి టెలికమ్యూనికేషన్స్(యూజర్ ఐడెంటిఫికేషన్) నిబంధనలు, బయోమెట్రిక్ గుర్తింపు ధృవీకరణ వ్యవస్థను వేగవంతంగా అమలు చేయాలని కేంద్రం పిలుపునిచ్చింది.
టెలికం సర్వీసు ప్రొవైడర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, వాటి అమల్లో సహకరించాలని ప్రభుత్వం కోరింది. 2023 ఆగస్టు 31న డీవోటీ జారీచేసిన సర్క్యులర్‌కు అనుగుణంగా సిమ్ యాక్టివేషన్లో పాలుపంచుకునే పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) విక్రేతల కోసం మరింత పటిష్టమైన ధృవీకరణ, జవాబుదారీ యంత్రాంగాలను కూడా నివేదికలో ప్రభుత్వం ప్రస్తావించింది. డిజిటల్ అరెస్టు మోసాలు సహా సైబర్ నేరాల కేసుల్లో ఉపయోగించే అనుమానాస్పద లేదా మోసపూరిత సిమ్ కార్డులను త్వరితగతిన బ్లాక్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అదనంగా దర్యాప్తు సమయంలో సబ్‌స్ర్కైబర్ యాక్టివేషన్ వివరాలు, పీవోఎస్ డాటాను రియల్ టైమ్‌లో చేరవేసేలా చేయడం ద్వారా చట్టాన్ని అమలుచేసే సంస్థలకు పూర్తి సహకారం అందించాలని టెలికం ఆపరేటర్లు, వాటి పీవోఎస్ ఏజెంట్లను ప్రభుత్వం కోరింది. ఆర్థికపరంగా సబ్‌స్ర్కైబర్ ఆధారిత ఆర్థిక మోసాల్లో పాలుపంచుకున్నాయని అనుమానించిన ఖాతాలపై తాత్కాలిక డెబిట్ హోల్డ్‌ల కోసం ఆర్బీఐకి చెందిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ)కు ప్రభుత్వం మద్దతు తెలిపింది. వివిధ న్యాయ పరిధిలో ఈ ఎస్వోపీ ఏకరీతిగా అమలు అయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వం తన నివేదికలో కోరింది.